Medchal-Malkajgiri, 10 November
ప్రగతినగర్ జిల్లా పరిషత్ హైస్కూల్, దాని ఆటస్థలంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు పాఠశాలను సందర్శించి, విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా కల్పించాయి. పాఠశాల భవనం, ఆటస్థలానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చాయి.
గత కొద్ది రోజులుగా ప్రగతినగర్ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆటస్థలం గురించి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, మంగళవారం నిజాంపేట్ సర్కిల్ కాంగ్రెస్ శ్రేణులు పాఠశాలను క్షేత్ర స్థాయిలో సందర్శించాయి. స్కూల్ భవనం, ఆటస్థలం గురించి వస్తున్న పలు వదంతులకు ముగింపు పలికే పరిష్కారం తీసుకుని వస్తామని, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే, ప్రగతినగర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 2015లో గ్రామంలోని రెండు లేఅవుట్లకు సంబంధించిన ఖాళీ స్థలంలో 2000 గజాలలో హైస్కూల్ నిర్మాణం, మరో 3000 గజాల స్థలం స్కూల్ ప్లే గ్రౌండ్‌కు కేటాయించి, పూర్తి ప్రహరీ నిర్మించి పాఠశాల అభివృద్ధి చేశారు. 11 సంవత్సరాలుగా ఎందరో నిరుపేద కుటుంబాల పిల్లలు ఈ హైస్కూల్లో చదివి ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 700 పైగా విద్యార్థులు ఉన్నారు. అయితే, ఇటీవల ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా స్కూల్ భవనం, ప్లే గ్రౌండ్ స్థలాల వివరాలు కోరుతూ అర్జీ పెట్టారు. అవి రెండు మున్సిపల్ రికార్డులలో స్థానికంగా ఉన్న రెండు లేఅవుట్ల పార్కుల స్థలాలుగా ఉన్నట్లు వివరాలు వెల్లడయ్యాయి. ఈ విషయం స్కూల్ సిబ్బందికి తెలియడంతో, పూర్తి వివరాలు తెలియని విద్యార్థులు, తల్లిదండ్రులు వారి చదువుకు ఆటంకం కలుగుతుందని భయందోళనలకు గురయ్యారు. పలు పార్టీలు, సంఘ సేవకులు స్కూల్‌కు ఎటువంటి నష్టం జరగకుండా అండగా ఉంటామని తెలపడంతో పాటు, పోరాటానికి సిద్ధమయ్యారు.
ఇదే అంశంపై మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు స్కూల్‌ను సందర్శించి, అన్ని అంశాలను పరిశీలించి, చట్టప్రకారం స్కూల్, స్కూల్ గ్రౌండ్‌కు ఎటువంటి ఇబ్బంది రాకుండా విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ హామీ
పాత్రికేయుల సమావేశంలో ప్రగతినగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్ము తాతిరెడ్డి మాట్లాడుతూ, 2015లో పంచాయతీ కాలంలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలకు ఈ స్థలం చెందేలా అప్పటి పాలకులు గానీ, ఆ తర్వాత మున్సిపాలిటీగా మారిన తర్వాత పాలకులు గానీ తగిన శ్రద్ధ తీసుకోకపోవడం, మున్సిపల్, రెవెన్యూ విభాగాల అధికారుల ద్వారా ఈ స్థలాన్ని విద్యాశాఖకు బదిలీ చేయించి పాఠశాలకు రక్షణ కల్పించకపోవడం వల్ల కొందరు ఆశావాహులకు అవకాశం కలిగినట్లయింది. ఇన్ని రోజులు పట్టించుకోని వారందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. తొందరలోనే స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంతరెడ్డి సహకారంతో, అవసరమైతే అన్ని శాఖల మంత్రులతో మాట్లాడి పాఠశాలకు, దాని ఆట స్థలానికి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా చట్టపరమైన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రజలు, పాత్రికేయుల సమక్షంలో రెండు లేఅవుట్లకు సంబంధించిన పాలకవర్గ అధ్యక్షులతో స్కూల్‌కు, ఆటస్థలానికి కేటాయించిన స్థలం పట్ల తమకేలాంటి అభ్యంతరాలు లేవని, విద్యార్థుల భవిష్యత్ కోసం తాము ఎప్పుడూ సహకారం అందిస్తామని కాలనీల తరపున అంగీకారం తెలిపారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ త్వరలోనే విద్యార్థులకు పూర్తి న్యాయం చేస్తుందని తెలిపారు.






