పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ రఘునాథపాలెం పాఠశాలలో గురువారం మెగా తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా పురోగతి, పరీక్షల ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించారు.
పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ రఘునాథపాలెం పాఠశాలలో గురువారం మెగా తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం పీఎం శ్రీ పథకం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనేక సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులకు యూనిఫామ్స్, ఐడీ కార్డులు, బెల్టులు, షూస్, డిక్షనరీలు, డైరీలు, నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సౌకర్యాలు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, విద్యా పురోగతికి దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం ఎస్ఏ-1 పరీక్షల ఫలితాలపై సమీక్ష నిర్వహించి, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో సమగ్ర ప్రగతి నివేదికలను (హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను) అందజేశారు. విద్యార్థుల ప్రగతి, హాజరు, క్రమశిక్షణ, చదువులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా తొమ్మిదవ తరగతి విద్యార్థి తండ్రి షేక్ సమద్ మాట్లాడుతూ, పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, ఇంటి వద్ద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మంచి అలవాట్లు, సంస్కారం, నైతిక విలువలు నేర్పించినప్పుడే విద్యార్థులు చదువులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. అదేవిధంగా పాఠశాల పూర్వ విద్యార్థి, మాజీ సర్పంచ్ శ్రీ రెంటాల ప్రసాద్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు తనకు నేర్పిన మంచి లక్షణాలు, విలువలే తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమని పేర్కొన్నారు. విద్యార్థులందరూ మంచి నడవడిక, క్రమశిక్షణ అలవర్చుకొని విద్యలో రాణించాలని, పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


