నేలకొండపల్లి, 13 November
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, నూతనంగా మంజూరైన 1,138 మంది లబ్ధిదారులకు చేయూత పింఛను మంజూరు పత్రాలను అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి మంత్రి పంపిణీ చేశారు.
పింఛన్ల పంపిణీ వివరాలు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 7-8 ఏళ్లుగా భర్తలను కోల్పోయి ఇబ్బందులు పడుతున్న మహిళలు, వికలాంగులు, గీత, నేత కార్మికుల కష్టాలను ప్రత్యక్షంగా చూసి, దీపావళి పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశామన్నారు. మండలంలో ఇప్పటివరకు ప్రతి నెలా రూ. 1 కోటి 82 లక్షల పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, పేదల సంక్షేమంలో వెనకడుగు వేయబోమని ఆయన అన్నారు. సన్నబియ్యం పథకం, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సున్నా వడ్డీ రుణాల కింద రూ. 73 వేల కోట్లు, రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరానికి రూ. 12 వేలు, సన్న రకాల వడ్లకు రూ. 500 బోనస్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన తెలిపారు.
ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలు
గత ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే, తమ ప్రభుత్వం పేదల కోసం 8 లక్షల గృహాలను రూ. 40 వేల కోట్లతో నిర్మిస్తోందని మంత్రి పేర్కొన్నారు. పార్టీలు, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద మహిళకు ఇల్లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మండలంలో ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారికి కూడా త్వరలో న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలోDRDOశ్రీరామ్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, MPDOఎర్రయ్య, తహసీల్దార్ రాంప్రసాద్, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.






