ఖమ్మం, 10 November
తెలంగాణ కాంగ్రెస్లో మీడియా విభాగం పదవుల ప్రకటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. నిన్న అత్యంత ఆర్భాటంగా ప్రకటించిన మీడియా ప్యానెలిస్టులు, కో-ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధుల నియామకాలకు 24 గంటలు గడవకముందే బ్రేక్ పడింది.
తెలంగాణ కాంగ్రెస్ లో మీడియా విభాగం పదవుల ప్రకటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. నిన్న అత్యంత ఆర్భాటంగా ప్రకటించిన మీడియా ప్యానెలిస్టులు, మీడియా కో-ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధుల నియామకాలకు 24 గంటలు గడవకముందే బ్రేక్ పడింది.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నియామకాలను నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది.
టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో నిన్న విడుదలైన ఈ జాబితాపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
నియామకాల జాబితాపై పలువురు నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదులు చేయడంతో, అధిష్టానం ఈ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
49 మందితో కూడిన ఈ జాబితా విడుదలైన మరుసటి రోజే నియామకాలను హోల్డ్ లో పెట్టడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది.






