ఆదివాసీ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న సుగుణక్క.. గ్రామ సమస్యలపై భరోసా
కెరమెరి మండలం రాంజీ గూడ, భీమన్ గొంది గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన గుస్సాడి, దండారి వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు. ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్న ఆమెకు గ్రామస్థులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామాల్లో నిర్వహించిన గుస్సాడి, దండారి నృత్యాలను ఆత్రం సుగుణక్క ఆసక్తిగా తిలకించారు. ఆదివాసీ కళాకారుల నృత్య ప్రదర్శనలను వీక్షించి, వారిని అభినందించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సుగుణక్క, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడి, దండారి వేడుకల నిర్వహణకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి గ్రామంలో దండారి వేడుకల నిర్వహణకు వీలుగా ప్రత్యేక షెడ్లు నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించినట్లు ఆమె పేర్కొన్నారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సుగుణక్క హామీ ఇచ్చారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గొయగం సర్పంచ్ ఆత్రం ఆనంద్ రావ్, పటేల్ సిడాం భీము, దండారి ఊరి పెద్ద ఆత్రం దేవురావు, పొత్ రాజ్ కమిటీ చైర్మన్ సిడాం రాజు, ఉప సర్పంచ్, కేరమేరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుజాయిత్ ఖాన్, జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి షైక్ ఫరూక్, మండల కార్యదర్శి మడావి రాజు, కొలం సంఘం జిల్లా అధ్యక్షులు ఆత్రం తిరుపతి, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి, కాంగ్రెస్ నాయకులు దిలీప్, వినేష్, కుంరం దేవేందర్, అయూబ్ ఖాన్, షైక్ గులాబ్, జమీర్ పఠాన్, చాహకటి భీమ్ రావ్, చాహకటి గంగు, తదితరులు పాల్గొన్నారు.












