కొత్తగూడెం, 13 November
భద్రాద్రి జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసులు గణనీయమైన పురోగతి సాధించారు. 2014 నుంచి 2024 మధ్య కాలంలో 829 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, 918 మంది జనజీవన స్రవంతిలో చేరారు. అభివృద్ధి కార్యక్రమాలు, పునరావాస చర్యలతో మావోయిస్టుల ప్రభావం తగ్గుతోందని అధికారులు తెలిపారు.
మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో రహదారులు, వైద్యం, విద్య, ఉపాధి సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ), భద్రాద్రి జిల్లా పోలీసు యంత్రాంగం సంయుక్తంగా శుక్రవారం ఉదయం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నక్సల్ ముక్త్ భారత్ అంశంపై మీడియా సదస్సు నిర్వహించాయి.
ఈ సదస్సులో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్, పీఐబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్గొన్నారు.
829 మంది అరెస్టు, 918 మంది లొంగుబాటు
సదస్సులో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, 2014 నుంచి 2024 వరకు భద్రాద్రి జిల్లా పరిధిలో 829 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. అదే కాలంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన 27 ఎదురుకాల్పుల ఘటనల్లో 57 మంది మావోయిస్టులు మరణించారు. మరో 918 మంది లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరారు. పోలీసుల నిరంతర చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన, అభివృద్ధి కార్యక్రమాలు, లొంగుబాట్లు, పునరావాస చర్యలతో మావోయిస్టు కార్యకలాపాలు క్రమంగా తగ్గాయని అధికారులు పేర్కొన్నారు.
గత హింసలో 868 మంది పౌరులు, 331 మంది పోలీసుల మృతి
గతంలో మావోయిస్టుల దాడులు, హింసాత్మక ఘటనల్లో 868 మంది పౌరులు, 331 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సదస్సులో అధికారులు వెల్లడించారు. పోలీస్ స్టేషన్లపై దాడులు, రహదారులు, వంతెనలపై పేలుళ్లతో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిందని వివరించారు. రహదారులు, వంతెనలు ధ్వంసం కావడంతో మారుమూల గ్రామాల ప్రజలు రవాణా, వైద్య, విద్యా సదుపాయాలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ ఘటనలు అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయని పేర్కొన్నారు.
పునరావాసంతో కొత్త జీవితం
లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాస విధానం కింద వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఆర్థిక సహాయం అందించే వెసులుబాటు ఉందని అధికారులు తెలిపారు. ఆయుధాలతో లొంగిపోయిన వారికి అదనపు ప్రోత్సాహక సహాయం అందించే అవకాశం ఉందని తెలిపారు. కుటుంబాలతో కలిసి జీవించేందుకు, స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోందని వివరించారు. సదస్సుకు హాజరైన పలువురు మాజీ మావోయిస్టులు తమకు అందిన వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఆర్థిక సహాయం, స్వయం ఉపాధి అవకాశాల గురించి మీడియాతో పంచుకున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు పునరావాసం తోడ్పడిందని తెలిపారు.
మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నామని, చిన్న పరిశ్రమలు, రైస్ మిల్లుల ఏర్పాటుకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, చదువుకు అవసరమైన సామగ్రి, క్రీడా పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు.


