తెలంగాణలోని అల్మాస్గూడలో బైబిల్ కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలపై జరిగిన దాడిని దళిత క్రైస్తవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పాగ యోనా తీవ్రంగా ఖండించారు. ఇది భారత రాజ్యాంగం ప్రసాదించిన మత స్వాతంత్రపు హక్కుకు భంగమని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని అల్మాస్గూడ ప్రాంతంలో బైబిల్ కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలపై ఒక వ్యక్తి అత్యంత దారుణంగా దాడి చేయడం బాధాకరమని దళిత క్రైస్తవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పాగ యోనా తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బైబిల్ కరపత్రాలు పంపిణీ చేయడం భారత రాజ్యాంగం ప్రసాదించిన మత స్వాతంత్రపు హక్కు అని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా తెలియజేయాలి కానీ మహిళలపై భౌతిక దాడులకు పాల్పడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు.
పోలీసులకు డిమాండ్
ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత మహిళలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మత స్వేచ్ఛను, మహిళల గౌరవాన్ని కాపాడాలని కోరుతూ, జై భీమ్, జై తెలంగాణ, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అని ఆయన పేర్కొన్నారు.











