ఆంధ్రప్రదేశ్‌ను సమీపిస్తున్న తీవ్ర తుపాను మురాసు నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్త చర్యలపై సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ () కేంద్రం నుంచి అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను ప్రభావం, సహాయక చర్యల సన్నద్ధతపై వివరాలు తెలుసుకున్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో వర్షాల కారణంగా వరద ప్రవాహాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నీటి నిల్వలు, జలాశయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు.
విద్యుత్ సరఫరా అంతరాయం నివారణ చర్యలు
తుపాను గాలుల కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, అవసరమైన పరికరాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు.
గత తుపాను అనుభవంతో ముందస్తు సన్నద్ధత
ఇటీవల అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ పనుల పురోగతిని కూడా చంద్రబాబు సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.











