*కూసుమంచి (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 13
పేదవాడి సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి కూసుమంచి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల దీవెనలతో ఏర్పడిన ఇందిరమ్మ ప్రభుత్వం త్వరలోనే మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదవాడి కష్టసుఖాలు తెలిసిన ప్రజా ప్రభుత్వంగా ఇచ్చిన ప్రతి హామీని వందకు వంద శాతం నెరవేరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో పేదవాడి ఆవేదనను పట్టించుకోకుండా కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారని, ప్రజలు వారిని ఇంటికి పంపిన తర్వాత ఇప్పుడు కపట ప్రేమ ఒలకబోస్తూ రోడ్లపై విషం కక్కుతున్నారని విమర్శించారు.
ఎన్నో ఏళ్లుగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వితంతువులు, దివ్యాంగుల కష్టాలను తీరుస్తూ, మొన్న దీపావళి కానుకగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల కొత్త చేయూత పెన్షన్లను మంజూరు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా ఒక్క కూసుమంచి మండలంలోనే 1,075 కొత్త పెన్షన్లను మంజూరు చేశామని, పాత వాటితో కలిపి మండలంలో ప్రతి నెలా రూ. 2 కోట్ల 29 లక్షల పెన్షన్ నిధులను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామని వివరించారు. వితంతువులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులతో పాటు డయాలసిస్, తలసేమియా బాధితులకు కూడా ఈ పెన్షన్లు ఎంతో భరోసానిస్తాయని తెలుపుతూ, ఈ నెల 19వ తేదీ నుండి పెన్షన్ డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి అన్నారు.
పార్టీలు, కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని, గులాబీ చొక్కా వేసుకున్న పేదవాడికి కూడా పెద్ద మనసుతో ఇల్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో 4.50 లక్షలు, రెండో విడతలో 2.50 లక్షలు, హైదరాబాద్లో లక్ష ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మొన్న దీపావళి నాడు రాష్ట్రవ్యాప్తంగా 2,21,500 ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులు దీపాలు వెలిగించుకుని ఆనందం వ్యక్తం చేశారని, ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రతి సోమవారం రూపాయి లంచం లేకుండా బిల్లులు చెల్లిస్తున్నామని, ఈ నవంబర్ చివరి కల్లా ఫైనల్ బిల్లులను కూడా పూర్తిగా జమ చేస్తామని అన్నారు.
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు, పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 33 నెలల్లో డ్వాక్రా మహిళా సంఘాలకు రూ. 73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చి ఆదుకున్నామన్నారు.
కూసుమంచి మండల అభివృద్ధిలో భాగంగా రూ. 5.50 కోట్లతో నూతన జూనియర్ కళాశాల, రూ. 9.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసుకున్నామని, అలాగే రూ. 47 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని మరికొద్ది నెలల్లోనే ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. గత పాలకులు రూ. 8 లక్షల 23 వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినప్పటికీ, తూచా తప్పకుండా ఆడబిడ్డలకు ఇచ్చిన మిగిలిన ఒకటి రెండు హామీలను కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

