ఖమ్మం రూరల్, 13 November
పేదల సంక్షేమానికి ఇందిరమ్మ రాజ్యం కట్టుబడి ఉందని, వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొత్త చేయూత పింఛను మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఆయన అందజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యం పేదల పక్షపాతి అని, వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మం మండలం ఎం. వెంకటాయపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో, కొత్త చేయూత పింఛను మంజూరు పత్రాలను లబ్ధిదారులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ పేదల పక్షపాతిగా ప్రభుత్వం పరిపాలిస్తోందని అన్నారు. ప్రజలకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపారు. మొన్నటి దీపావళి పండుగ నాడు రాష్ట్రవ్యాప్తంగా 2,21,500 కుటుంబాలు తమ సొంత ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు చేసి పండుగ జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్లో లక్ష ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ. 40 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి కులం, మతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, పింక్ షర్ట్ ధరించినా సరే, పేదవారైతే చాలు ఇందిరమ్మ ఇల్లు అందించి తీరుతామని హామీ ఇచ్చారు.
సంక్షేమ పథకాల అమలు
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో గడిచిన 33 నెలల్లో డ్వాక్రా మహిళలకు రూ. 73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను అందించామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తెలంగాణలో పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ఇవ్వని కొత్త రేషన్ కార్డులను తమ ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఇంకా ఎవరైనా చేయూత పెన్షన్ కు అర్హులై ఉంటే మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కె. శ్రీరామ్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, ఖమ్మం ఎంపిడిఓ కె. రవికుమార్, తహసీల్దార్ వినయేందర్ రెడ్డి, మండలంలోని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

