యల్లనూరు, 13 November
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ప్రగతి నగర్ డివిజన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థలం విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. పాఠశాల స్థలాన్ని పరిరక్షిస్తామని వారు హామీ ఇచ్చారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, ప్రగతి నగర్ డివిజన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థలం విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ, పాఠశాల స్థలం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పాఠశాల స్థలంలోకి ఎవరూ అడుగుపెట్టడానికి వీలు లేదని స్పష్టం చేశారు. త్వరలోనే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసి, పాఠశాల స్థలానికి సంబంధించి చట్టపరంగా అన్ని హక్కులు కల్పించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి (డీఈఓ)కి, పాఠశాల స్థలాన్ని రక్షించడానికి తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

