ఖమ్మం, 11 November
ఖమ్మం కోర్టు కాంప్లెక్స్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఖమ్మం ఆధ్వర్యంలో న్యాయ సేవల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం న్యాయ అవగాహన ర్యాలీ, న్యాయ సేవల ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం. నాగరాజు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో న్యాయాధికారులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.
అనంతరం ఖమ్మంలోని న్యాయ సేవా సదన్ భవనంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవల ప్రదర్శనను చైర్మన్ ప్రారంభించారు. ఇందులో పథకాలు, ఉచిత న్యాయ సహాయానికి సంబంధించిన పుస్తకాలు, కరపత్రాలను ప్రజల అవగాహన కోసం ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. దేవి మానస మాట్లాడుతూ, ఆర్థిక కారణాలతో ఏ ఒక్కరూ న్యాయ సహాయానికి దూరం కాకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షులు వై. రమేష్, న్యాయాధికారులు, ప్యానల్ న్యాయవాదులు పాల్గొన్నారు.

