శారీరక వైకల్యాన్ని జయించి దేశానికి సిల్వర్ మెడల్ తెచ్చిన వరంగల్ యువకుడు షేక్ అబ్దుల్ నదీమ్, కుటుంబ పోషణ కోసం నేడు జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.
వరంగల్ నగరానికి చెందిన షేక్ అబ్దుల్ నదీమ్, గతంలో ఖమ్మం తుమ్మల గడ్డ ప్రాంతంలో నివసించేవారు. ఆయన గాథ ఇది. శారీరక వైకల్యాన్ని జయించి దేశం కోసం అంతర్జాతీయ వేదికపై సిల్వర్ మెడల్ సాధించినా, కుటుంబ పోషణ కోసం నేడు జొమాటో డెలివరీ బాయ్ గా రోడ్లపై తిరుగుతున్నాడు.
ఓరుగల్లుకు చెందిన నదీమ్ కు 2015లో స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ కారణంగా రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. డిగ్రీ వరకు చదువుకున్న నదీమ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవితాంతం వీల్ చైర్ కే పరిమితమైనా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.
గత నాలుగేళ్లుగా క్రీడా రంగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. శ్రీలంకలో జరిగిన ఫస్ట్ సౌత్ ఏషియన్ పారా సిట్టింగ్ త్రో బాల్ పోటీల్లో సిల్వర్ మెడల్, జాతీయ స్థాయిలో పారా తైక్వాండోలో బ్రాంజ్ మెడల్, ఓపెన్ నేషనల్స్ లోనూ బ్రాంజ్ మెడల్ సాధించారు. పలు మారథాన్ లలో కూడా పతకాలు సాధించారు.
పతకాలు సాధించినా ప్రభుత్వం నుండి ఎలాంటి ఉద్యోగం రాలేదని, అందుకే తన ప్రత్యేకంగా రూపొందించుకున్న ట్రై-సైకిల్ పై జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని నదీమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ కోటాలో తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు.











