ఖమ్మం, 9 November
45 రోజుల ప్రత్యేక పాలన కార్యాచరణలో భాగంగా రఘునాథపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది.
45 రోజుల ప్రత్యేక పాలన కార్యాచరణలో భాగంగా రఘునాథపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి సర్పంచులు హాజరయ్యారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యర్రగర్ల హనుమంతరావు కూడా ఈ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో అశోక్ మాట్లాడుతూ, ప్రస్తుతం చలికాలం కావడంతో నీటి లభ్యత బాగున్నట్లు కనిపిస్తున్నా, ఎల్నినో ప్రభావంతో రానున్న 7 నుంచి 8 నెలల పాటు తీవ్ర ఎండలు, తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మండలానికి సరఫరా అయ్యే నీటి సమయం తగ్గే అవకాశం ఉందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడేలా సర్పంచులు అవగాహన కల్పించాలని సూచించారు.
ఎంపీఓ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, గ్రామ సమస్యలు తెలిసిన వ్యక్తి సర్పంచేనని, వాడిన నీరు భూమిలోకి ఇంకేలా చూడాలని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలని కోరారు. తాగునీటి ట్యాంకుల లీకేజీలను సరిచేయించాలని, మిషన్ భగీరథ నీరు నిలిచిపోతే పంచాయతీ బోర్లు అందుబాటులో ఉంచుకోవాలని, పంచాయతీ నిధులు మొదట తాగునీటికే ఖర్చు చేయాలని సూచించారు.
వ్యవసాయ శాఖ సూచనలు
వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ, నీరు ఎక్కువ అవసరమయ్యే పంటలకు బదులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు వేయాలని, పంట వ్యర్థాలను తగలబెట్టవద్దని సూచించారు.
పశుసంవర్ధక శాఖ సూచనలు
పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువుల షెడ్లు, పశుగ్రాసం కోసం ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు.
వైద్యాధికారుల సూచనలు
మండల వైద్యాధికారులు మాట్లాడుతూ, ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మేళాను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో మద్యం, పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా సర్పంచులు నిఘా ఉంచాలని, ఆశా వర్కర్లకు పంచాయతీ సిబ్బంది సహకరించాలని సూచించారు.
విద్యుత్ శాఖ అధికారులు, విద్యుత్ ను పొదుపుగా వాడాలని, అవసరం ఉన్నప్పుడే వ్యవసాయ మోటార్లు నడపాలని, సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు.
మార్కెట్ చైర్మన్ యర్రగర్ల హనుమంతరావు మాట్లాడుతూ, అధికారులు సూచించిన అంశాలను సర్పంచులు అమలు చేయాలని, నీటి కొరత రాకుండా ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ వంటి పనులకు రైతులు ముందుకు రావాలని, వాటికి మార్కెట్ యార్డు తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.










