Medchal–Malkajgiri/Ghatkesar (ఆజాద్ తెలంగాణ) నవంబర్ 09
88 రోజుల తర్వాత కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదా పడి నిరవధికంగా కొనసాగడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడి 88 రోజులు గడిచినా ఇంకా సెషన్‌ను ప్రోరోగ్ చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. మోదీ ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రమాదకరమైన, వినాశకరమైన డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవడం కోసమే ప్రభుత్వం ఈ జాప్యం చేస్తోందని మండిపడింది. లోక్‌సభలో ఎలాగైనా అక్రమ పద్ధతిలో మూడింట రెండొంతుల మెజారిటీని సంపాదించడానికి అమిత్ షాకు సమయం ఇవ్వడానికే 88 రోజులైనా సెషన్‌ను ప్రోరోగ్ చేయలేదని ఆరోపించింది. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తీవ్రంగా స్పందించారు.
నాలుగు సార్లు మోదీకి ఖర్గే లేఖలు
డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గత ఆరు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీకి నాలుగు సార్లు లేఖలు రాశారని జైరాం రమేశ్ తెలిపారు. అయినా ప్రధాని మోదీ అందుకు మొండిగా నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసి నేటికి 88 రోజులు గడిచినా, దానిని ఇంకా ప్రొరోగ్ చేయలేదని పేర్కొన్నారు. భారత పార్లమెంటరీ విధానాలపై ప్రామాణిక గ్రంథమైన కౌల్ అండ్ శక్ధేర్ 8వ సంచికలోని 192వ పేజీలో లోక్‌సభ నిరవధిక వాయిదాకు, సమావేశాల ప్రోరోగ్ కు మధ్య సాధారణంగా 2-4 రోజుల వ్యవధి ఉంటుందని వెల్లడించారు. కానీ అదే పేజీలోని ఫుట్ నోట్ 53లో సెషన్ ప్రోరోగ్ గరిష్ఠ వ్యవధి 28 రోజులుగా ఉందని, అది కూడా 2015 నాటి వర్షాకాల సమావేశాలకు సంబంధించినదని స్పష్టం చేశారు. 2024లో విడుదలైన ఈ పుస్తకానికి ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం కూడా పంపారని గుర్తు చేశారు.
2008 నాటి పరిస్థితులు వేరు
2008 (యూపీఏ ప్రభుత్వం)లో కూడా రికార్డు స్థాయిలో 87 రోజుల పాటు సభను రద్దు చేయకుండా ఉంచారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవలే లేఖ రాయడంపైనా జైరాం రమేశ్ స్పందించారు. 2008లో ప్రత్యేక పరిస్థితుల కారణంగా అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే 87 రోజుల పాటు సెషన్ ప్రోరోగ్ కాలేదు. అయినప్పటికీ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లెక్క ప్రకారం చూస్తే ఈ రోజు (సోమవారం) ఒక కొత్త రికార్డు నమోదైంది. 2008తో సహా గతంలాగా కాకుండా లోక్‌సభలో అక్రమ పద్ధతిలో మూడింట రెండొంతుల మెజారిటీని ఎలాగోలా సాధించి ప్రమాదకరమైన, వినాశకరమైన డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర హోం మంత్రికి సమయం ఇవ్వడానికే ఈ రికార్డును నెలకొల్పారు. గతంలో 2017న లోక్‌సభలో ప్రతిపక్షాల ఐక్యత కారణంగా ఈ బిల్లు విషయంలో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమిత్ షా దుష్ట పన్నాగాలను విపక్షాలు సునాయాసంగా ఓడించాయి. మరోసారి అమిత్ షా బుల్డోజర్ ఎత్తుగడలను అడ్డుకుంటాం అని జైరాం రమేశ్ స్పష్టం చేశారు.


